సామెతలు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31


చాప్టర్ 3

నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము.
2 అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవ త్సరములను శాంతిని నీకు కలుగజేయును.
3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్య కుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.
4 అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు.
5 నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము
6 నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
7 నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము
8 అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.
9 నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘన పరచుము.
10 అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును.
11 నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు.
12 తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.
13 జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు.
14 వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు.
15 పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.
16 దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి.
17 దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.
18 దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.
19 జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.
20 ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించు చున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.
21 నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము
22 అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును
23 అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.
24 పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.
25 ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు
26 యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపా డును.
27 మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
28 ద్రవ్యము నీయొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.
29 నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించు నపుడు వానికి అపకారము కల్పింపవద్దు.
30 నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడ మాడవద్దు.
31 బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయ గోర వద్దు
32 కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును.
33 భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.
34 అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును.
35 జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.