సామెతలు
చాప్టర్ 16
హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.
2 ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.
3 నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.
4 యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.
5 గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.
6 కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.
7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.
8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.
9 ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును
10 దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు.
11 న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను.
12 రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును.
13 నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు.
14 రాజు క్రోధము మరణదూత జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును.
15 రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు.
16 అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా దించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.
17 చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును.
18 నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
19 గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు.
20 ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.
21 జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.
22 తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష
23 జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.
24 ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.
25 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.
26 కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును.
27 పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది.
28 మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.
29 బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును కానిమార్గములో వాని నడిపించును.
30 కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు.
31 నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.
32 పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు
33 చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము.