అపొస్తలుల కార్యములు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28


చాప్టర్ 24

అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయ వాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.
2 పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతనిమీద నేరముమోప నారంభించి యిట్లనెను
3 మహా ఘనతవహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము.
4 నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండ మేము క్లుప్తముగా చెప్పుకొనుదానిని తమరు ఎప్పటివలె శాంతముగా వినవలెనని వేడుకొను చున్నాను.
5 ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోక మందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి,
6 మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి.
7 తమరు విమర్శించిన యెడల
8 మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను.
9 యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి.
10 అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగచేయగా అతడిట్లనెను తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను.
11 యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాట నుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.
12 దేవాలయములో నేమి, సమాజమందిరములలో నేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుటయైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు.
13 మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు.
14 ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమి్మ,
15 నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.
16 ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.
17 కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని.
18 నేను శుద్ధి చేసికొనినవాడనై యీలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపుకూర్చి యుండలేదు, నావలన అల్లరి కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి;
19 నామీద వారికేమైన ఉన్నయెడల వారే తమరి సన్ని ధికివచ్చి నామీద నేరము మోపవలసియుండెను.
20 లేదా, నేను మహాసభయెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమునుగూర్చి నేడు వారియెదుట విమర్శింపబడు చున్నానని
21 వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన యీ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైన చెప్పవచ్చుననెను.
22 ఫేలిక్సు ఈ మార్గమునుగూర్చి బాగుగా ఎరిగినవాడైసహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను.
23 మరియు అతని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను.
24 కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను.
25 అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించు చుండగా ఫేలిక్సు మిగుల భయపడిఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను.
26 తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను.
27 రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచి వాడనిపించుకొనవ లెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను.