యెషయా గ్రంథము

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66


చాప్టర్ 41

ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి జనములారా, నూతనబలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి.
2 తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు.
3 అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్ళనిత్రోవనే సురక్షితముగ దాటిపోవుచున్నాడు.
4 ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను.
5 ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు వణకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు
6 వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పు కొందురు.
7 అతుకుటనుగూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును సుత్తెతో నునుపుచేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండ పనివాడు మేకులతో దాని బిగించును.
8 నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ,నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,
9 భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,
10 నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.
11 నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందె దరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు
12 నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.
13 నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
14 పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.
15 కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయు దువు కొండలను పొట్టువలె చేయుదువు
16 నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొని పోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.
17 దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.
18 జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించు నట్లు
19 చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.
20 నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం చెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను.
21 వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పు చున్నాడు.
22 జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.
23 ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి.
24 మీరు మాయాసంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకొనువారు హేయులు.
25 ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కు నట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.
26 మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు తెలియజెప్పినవాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వ కాలమున దానిని తెలియజెప్పినవాడెవడు? దాని తెలియజెప్పువాడెవడును లేడు వినుపించు వా డెవడును లేడుమీ మాటలు వినువాడెవడును లేడు.
27 ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని.
28 నేను చూడగా ఎవడును లేకపోయెను నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త యెవడును లేకపోయెను.
29 వారందరు మాయాస్వరూపులు వారి క్రియలు మాయ వారి పోతవిగ్రహములు శూన్యములు అవి వట్టిగాలియై యున్నవి.