రాజులు మొదటి గ్రంథము

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22


చాప్టర్ 13

అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవు నొంది యూదాదేశమునుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి యుండగా
2 ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రక టనచేసెనుబలిపీఠమా బలి పీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగాదావీదు సంత తిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.
3 ఈ బలిపీఠము బద్దలై పోయి దానిమీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన యొకటి యిచ్చెను.
4 ​బేతేలునందున్న బలి పీఠమునుగూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠముమీదనుండి తన చెయ్యి చాపి, వానిని పట్టు కొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండి పోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తిలేక పోయెను.
5 ​మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచనచొప్పున బలిపీఠము బద్దలుకాగా బుగ్గి దానిమీదనుండి ఒలికిపోయెను.
6 ​అప్పుడు రాజునా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మును పటివలె ఆయెను.
7 ​అప్పుడు రాజునీవు నా యింటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదనని ఆ దైవజనునితో చెప్పగా
8 ​​దైవజనుడు రాజుతో ఇట్లనెనునీ యింటిలో సగము నీవు నాకిచ్చినను నీతోకూడ నేను లోపలికి రాను; ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను;
9 అన్నపానములు పుచ్చుకొన వద్దనియు, నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని రాజుతో అనెను.
10 అంతట అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్లక మరియొక మార్గమున తిరిగిపోయెను.
11 బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపుర ముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటిని, అతడు రాజుతో పలికిన మాటలన్నిటిని తమ తండ్రితో తెలియ జెప్పగా
12 వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్లిపోయె నని వారినడిగెను; అంతట అతని కుమారులు యూదాదేశ ములోనుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్లిపోయినది తెలిపిరి.
13 ​పిమ్మట అతడు తన కుమారులను పిలిచినాకొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి. అతడు దానిమీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి
14 ​మస్తకివృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచియూదాదేశములోనుండి వచ్చిన దైవజనుడవు నీవేనా? అని అడుగగా అతడునేనే అనెను.
15 ​అప్పుడు అతడునా యింటికి వచ్చి భోజనము చేయుమనగా
16 ​అతడునేను నీతోకూడ మరలి రాజాలను, నీ యింట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను
17 ​నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరుగవద్దనియు యెహోవా వాక్కుచేత నాకు సెలవాయెనని చెప్పెను.
18 ​అందుకతడునేనును నీవంటి ప్రవక్తనే; మరియు దేవదూత యొకడుయెహోవాచేత సెలవుపొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ యింటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా
19 అతడు తిరిగి అతనితోకూడ మరలి పోయి అతని యింట అన్నపానములు పుచ్చుకొనెను.
20 ​వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్ష మాయెను.
21 ​అంతట అతడు యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుని పిలిచియెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడునీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞా పించినదానిని గైకొనక
22 ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి, నీవు అచ్చట అన్న పానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనుక, నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని యెలుగెత్తి చెప్పెను.
23 అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిదమీద గంత కట్టించెను.
24 అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచి యుండెను, సింహమును శవముదగ్గర నిలిచి యుండెను.
25 ​కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండు టయు, సింహము శవముదగ్గర నిలిచియుండుటయు చూచి, ఆ ముసలిప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి.
26 ​​మార్గములోనుండి అతని తోడు కొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడుయెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే; యెహోవా సింహమునకు అతని అప్పగించి యున్నాడు; యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి
27 తన కుమారులను పిలిచిగాడిదకు నాకొరకు గంత కట్టుడని చెప్పెను. వారు అతనికొరకు గంత కట్టినప్పుడు
28 అతడు పోయి అతని శవము మార్గమందు పడి యుండుటయు, గాడిదయు సింహమును శవముదగ్గర నిలిచి యుండుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక యుండుటయు చూచి
29 ​దైవజనుని శవము ఎత్తి గాడిదమీద వేసికొని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను.
30 అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులుకటకటా నా సహోదరుడా అని యేడ్చిరి.
31 మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టినేను మరణ మైనప్పుడు దైవజనుడైన యితడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతి పెట్టుడి; నా శల్యములను అతని శల్యముదగ్గర ఉంచుడి,
32 ​యెహోవా మాటనుబట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను, షోమ్రోను పట్టణములో నున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికి విరోధము గాను, అతడు ప్రకటించినది అవశ్య ముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను.
33 ​ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గ మును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను.
34 ​యరొబాముసంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను.