సమూయేలు మొదటి గ్రంథము
చాప్టర్ 11
అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదు.. కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరుమేము నీకు సేవచేయుదుము, మాతో నిబంధనచేయుమని నాహాషుతో అనిరి
2 ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చునట్లు మీయందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసెదనని అమ్మోనీయుడైన నాహాషు
3 యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారుమేము ఇశ్రాయేలీయుల సరిహద్దు లన్నిటికి దూతలను పంపుటకై యేడు దినముల గడువు మాకిమ్ము; మమ్మును రక్షించుటకు ఎవరును లేక పోయిన యెడల మమ్మును మేము నీకప్పగించుకొనెద మనిరి.
4 దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్త మానము తెలియజెప్పగా జనులందరు బిగ్గరగా ఏడ్చిరి.
5 సౌలు పొలమునుండి పశువులను తోలుకొని వచ్చుచుజనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషువారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి.
6 సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై
7 ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపిసౌలుతోను సమూయేలుతోను చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి.
8 అతడు బెజెకులో వారిని లెక్క పెట్టగా ఇశ్రాయేలువారు మూడు లక్షలమందియు యూదావారు ముప్పదివేల మందియు అయిరి.
9 అప్పుడురేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషువారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి.
10 కాబట్టి యాబేషువారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరిరేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకొందుము, అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును.
11 మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండుమధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతముచేయగా వారిలో మిగిలినవారు ఇద్దరేసికూడి పోజాలకుండ చెదరిపోయిరి.
12 జనులుసౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి? మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయేలుతో అనగా
13 సౌలునేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను.
14 మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా
15 జనులందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి, యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి.